Best Viewed in Mozilla Firefox, Google Chrome

ప్రభుత్వ మద్దతు ధరకే ధాన్యం కొనుగోలు చేయాలి / Paddy should be bought for Minimum Support Price

PrintPrintSend to friendSend to friend

తెనాలి, డిసెంబర్ 18:ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకే ఖరీఫ్ వరి ధాన్యం కొనుగోలు జరిగేలా అధికారులు, మిల్లర్లు సమన్వయంతో వ్యవహరించి రైతుకు ప్రయోజనం చేకూరేలా చూడాలని స్పీకర్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక పొదుపు భవన్‌లో ఖరీఫ్ వరి ధాన్యం కొనుగోళ్ళ అంశంపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో పాల్గొన్న స్పీకర్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్ళ విషయంలో జిల్లావ్యాప్తంగా రైతులకు భరోసా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కోరుకుంటాడని, ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు ధాన్యం కొనుగోళ్ళు జరుగుతాయనే నమ్మకం రైతుల్లో కల్పించాలని అధికారులకు సూచించారు.ప్రభుత్వం ఎప్పుడు రైతులకు అండగా ఉంటుందనే నమ్మకాన్ని పెంచేలా అధికారులు చిత్తశుద్ధితో ధాన్యం కొనుగోలు కేంద్రాల పనితీరుపై దృష్టి పెట్టాలన్నారు.ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యం అవసరమన్నారు. జిల్లాకు 2లక్షల 60వేల మెట్రిక్ టన్నుల ధాన్యం అవసరంకాగా, ఈ సంవత్సరం 9లక్షల 15వేల మెట్రిక్ టన్నుల మేర దిగుబడులు రాగలవనే అంచనాలున్నాయని అన్నారు. అవసరం కన్నా నాలుగు రెట్లు ధాన్యం దిగుబడులు రావడం వెనుక, రైతుల కృషి ఎంతో ఉందని, క్షేత్రస్థాయిలో రైతుకు ప్రభుత్వం కల్పించిన గిట్టుబాటు ధర లభించేలా, గ్రామస్థాయిలో ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో కృషి చేయాలన్నారు. జిల్లా ఇంచార్జి కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్ మాట్లాడుతు జిల్లాలో 2లక్షల 80వేల హెక్టార్లలో వరి సాగుచేయాల్సి ఉండగా, లక్షా 74వేల హెక్టార్లలోనే రైతులు పంటలు వేశారన్నారు. దిగుబడి గురించి చెబుతు 9లక్షల 92వేల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందనే అంచనాలున్నాయన్నారు. గుంటూరు జిల్లాలో సాగు చేసిన వరిలో 85శాతం బిపిటి రకమేనని , మామూలు ధాన్యం గ్రేడ్ ఎ రకం క్వింటాల్ రూ. 1280, సాధారణ రకం ధాన్యం క్వింటాల్‌కు రూ.1250గాను, కనీస మద్దతు ధర చెల్లించాల్సి ఉందన్నారు.ప్రభుత్వం బిపిటి రకానికి క్వింటాల్ కు 1500 ప్రోత్సాహక ధరగా నిర్ణయించినట్లువివరించారు. ఈ అంశాలపై గ్రామాల్లో రైతులకు అర్ధమయ్యేలా ప్రచారం కల్పించాలన్నారు. జిల్లాలో మోత్తం 65 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తుండగా, ఇందులో గుంటూరు డివిజన్‌లో16, తెనాలి డివిజన్‌లో42,నరసరావుపేట డివిజన్‌కు 7కేంద్రాలు పనిచేస్తాయన్నారు.పౌర సంబంధాల సంస్థలతోపాటు, పొదుపు సంఘాలు కూడా ధాన్యం కొనుగోలుకు భాగస్వామ్యం వహించ నున్నాయని చెబుతు,ప్రాధమిక వ్యవసాయ సహకారం సంఘాలు మరో రెండు రోజుల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలనుప్రారంభిస్తాయని ఇంచార్జి కలెక్టర్ యువరాజ్ వివరించారు. సమావేశంలో పౌరసంబంధాల సంస్థ డిఎమ్ ఎ.కృష్ణారావు, డిఎస్‌ఒ రవితేజనాయక్, ఎఫ్‌సిఐ ఏరియా మేనేజర్ అఖిలేష్‌ఓజా, డిఆర్‌డిఎ అదనపు పిడి ప్రసాద్, ఆర్డీఒ ఎస్.శ్రీనివాసమూర్తి, వ్యవసాయశాఖ డిడి పద్మావతి, తహశీల్దార్లు, సిఎస్‌డిటిలు, రైస్‌మిల్లర్స్ తదితర సిబ్బంది పాల్గొన్నారు.

Courtesy : http://www.andhrabhoomi.net/content/t-27

Copy rights | Disclaimer | RKMP Policies