Best Viewed in Mozilla Firefox, Google Chrome

తీరు మారకపోతే వరికి ఉరే!

PrintPrintSend to friendSend to friend
  వాతావరణ మార్పులే అసలు సమస్యసాగుచేసే రకాలు.. పద్ధతులూ మారాల్సిందేలేకుంటే వరి సాగు కష్టమే!
నవంబర్, డిసెంబర్ నెలల్లోనే తుఫానులు అధికంగా వస్తున్నాయి. పంట నష్టం కూడా ఎక్కువగా ఉంటున్నది. ఖరీఫ్ వరి నాట్లు ముందుగానే పడితే.. నవంబర్ రెండో వారంలోగా పంట చేతికి వస్తే.. తుఫానుల బారి నుంచి చాలావరకు బయటపడవచ్చు. ఈ పనిని రైతులు ఎందుకు చేయలేకపోతున్నారు? సమస్యలేమిటి? దీనిపై మోహన్‌కందా కమిటీ అధ్యయనం చేసింది. శాస్త్రవేత్తలూ పరిశోధనలు జరిపారు. పరిష్కార మార్గాలు చూపారు. మరి అధికారులు, రైతులు వాటిని పాటిస్తారా? పాటిస్తేనే వ్యవసాయానికి మనుగడ. లేకుంటే...!
(హైదరాబాద్, ఆంధ్రజ్యోతి) వాతావరణంలో మార్పులు వరిసాగుకు శాపంగా మారాయని అంటున్నారు కేంద్రీయ మెట్ట వ్యవసాయ పరిశోధనా సంస్థ శాస్త్రవేత్తలు. గత 60 ఏళ్ల వర్షపాతం గణాంకాలను పరిశీలిస్తే.. వరినాట్లకు ముఖ్యమైన జూలై నెలలో 100 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడానికి అధిక సమయం తీసుకుంటోందని, దీనివల్ల వరి నాట్లు ఆలస్యమవుతున్నాయని అంటున్నారు. నాట్లు ఆలస్యం కావడంతో దాని ప్రభావం దిగుబడిపైనా చూపుతోంది. రాష్ట్రంలో వరిసాగు గిట్టుబాటు కాకపోవడంతో రెండేళ్ల కిందట రైతులు క్రాప్‌హాలిడే ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన ప్రభుత్వం అధ్యయనం కోసం మాజీ సీఎస్ మోహన్‌కందా నేతృత్వంలో ఓ కమిటీని వేసింది. నీటి విడుదలలో జాప్యం కారణంగా వరి సాగు ఆలస్యమవుతోందని, దీంతో నవంబర్లో వచ్చే తుఫాన్లు, అధిక వర్షాల బారినపడి రైతులు పంటనష్టపోవాల్సి వస్తోందన్నది మోహన్‌కందా కమిటీ గుర్తించిన ముఖ్యమైన అంశాల్లో ఒకటి. కాల్వల మరమత్తులు ఏప్రిల్‌లోనే పూర్తిచేసి సకాలంలో నీళ్లు వదలాలని రైతులూ డిమాండు చేస్తున్నారు. కాలువ చివరి భూములకు పొట్ట దశలో తగినంత నీరు అందకపోవడంతో దిగుబడులు తగ్గుతున్నాయని వాపోతున్నారు. ఈ నేపథ్యంలో మోహన్‌కందా నివేదిక, రైతుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని హైదరాబాద్‌లోని కేంద్రీయ మెట్ట వ్యవసాయ పరిశోధనా సంస్థ(క్రీడా) శాస్త్రవేత్తలు బి.బాపూజీరావు, బి.వెంకటేశ్వర్లు విశ్లేషణాత్మక పరిశీలన చేశారు.
 
తమ పరిశోధనలో గమనించిన అంశాలను వారు వెల్లడించారు. అందులో వాతావరణ మార్పులు వరిసాగుపై ఎలా ప్రభావం చూపుతున్నాయన్న దానిపై ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. వాటి ప్రకారం.. ఇటీవలికాలంలో కృష్ణా, గోదావరి నదుల ఆధారంగా నిర్మించిన ప్రాజెక్టుల నుంచి జూన్, జూలై నెలల్లో విడుదలయ్యే నీటి పరిమాణం బాగా తగ్గిపోయింది. గోదావరి నదికి సంబంధించి జూలైలో విడుదలయ్యే నీటి పరిమాణంలో చెప్పుకోదగ్గ మార్పులు లేనప్పటికీ.. జూన్ చివరలో విడుదలయ్యే నీటి పరిమాణం తగ్గుతోంది. దీంతో ఆయకట్టు అంతటికీ జూలై మొదటి పక్షంలో తగినంత నీరు చేరట్లేదు. కాగా.. ప్రకాశం బ్యారేజీ నుంచి విడుదలయ్యే నీటిని గమనిస్తే.. జూన్, జూలై నెలల్లో విడుదలయ్యే నీటి పరిమాణం తగ్గిపోయింది. దీనివల్ల కృష్ణా, తూర్పు, పశ్చిమ డెల్టాలకు తగినంత నీరు అందట్లేదు. ప్రకాశం బ్యారేజీ నుంచి నీటి విడుదల ఆలస్యమవుతుండడంతో నాట్లూ ఆలస్యమవుతున్నాయి. అయితే ఈ ప్రాంతాల్లో నాట్లు వేసేందుకు వ్యవసాయ వర్సిటీ సిఫారసు చేసిన సమయం జూలై. అలాగే సిఫారసు చేసిన రకాలు.. స్వర్ణ, బీపీటీ, చైతన్య, కృష్ణవేణి. వీటి పంట కాలం 150 నుంచి 165 రోజులు. జూలైలో నాటితే నవంబర్ మొదటి భాగంలో కోతకు వస్తాయి. దీంతో తుఫాన్లు, భారీ వర్షాల బారి నుంచీ తప్పించవచ్చు. అయితే నీటి విడుదలలో జాప్యం కారణంగా సకాలంలో పంట కోతకు రాక.. తుఫాన్ల వల్ల నష్టపోవాల్సి వస్తోంది. మరోవైపు వాతావరణంలో వచ్చిన మార్పులు కూడా నాట్ల ఆలస్యానికి కారణమవుతున్నాయి. నాట్లకు ముందు.. దుక్కి దున్నేందుకు 50 మిల్లీమీటర్లు, దమ్ము చేసేందుకు వంద మిల్లీ మీటర్ల నీరు అవసరం. ఈ నీటి మొత్తానికీ కాల్వల మీద ఆధారపడితే మధ్య, దిగువ ప్రాంతాల్లో నాట్లు ఆలస్యం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది.
ఈ వంద మిల్లీమీటర్ల నీటిలో కొంత భాగం వర్షాల ద్వారా లభిస్తే కాల్వ నీటి మీద ఒత్తిడి తగ్గుతుంది. డెల్టా ప్రాంతాల్లో సకాలంలో నాట్లూ పడతాయి. ఈ అంశంపై పరిశోధనకుగాను 1951 నుంచి 2007 వరకు జూలైలో వర్షపాతం వివరాలను పరిశీలించిన శాస్త్రవేత్తలు.. జూలై నెలలో వంద మిల్లీలీటర్ల వర్షం పడేందుకు పట్టే సమయం గతం కంటే పెరిగిందని గుర్తించారు. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు, ఉభయగోదావరి జిల్లాల్లో ఈ తేడా స్పష్టంగా కనిపిస్తోంది. వంద మిల్లీమీటర్ల వర్షం పడేందుకు సమయం ఆలస్యమైన కొద్దీ రోజువారీ పడిన తేలికపాటి వర్షం ఆవిరవుతోంది. దీంతో దమ్ముకు సరిపడా తేమ భూమిలో ఉండడం లేదు. దీంతో దమ్ముకు కావలసిన నీటికోసం కాల్వలపైనే ఆధారపడాల్సి వస్తోంది. కాల్వల ద్వారా లభ్యమయ్యే నీరు ఏటికేడాది తగ్గుతుండడంతో నాట్లు ఆలస్యమవుతున్నాయి. ఉదాహరణకు పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో 100 మిల్లీమీటర్ల వర్షం పడేందుకు 1990ల్లో 14 రోజులు పడితే.. 2000-10లో 26 రోజులు పట్టింది. కొన్నిసార్లు 32-41 రోజులు ఆలస్యమైనట్లు మండలాలవారీ వర్షపాతం వివరాలు చెబుతున్నాయి. సకాలంలో నాట్లు వేయని కారణంగా ఎరువుల మోతాదును పెంచేందుకు సగటున ఎకరానికి రూ.1250 ఖర్చు చేయాల్సి వస్తోంది. కృష్ణా, ఉభయగోదావరి, గుంటూరు జిల్లాలకు సంబంధించి పుణేలోని భారత ఉష్ణదేశ వాతావరణ పరిశోధన సంస్థ కంప్యూటర్ మోడల్స్‌ను పరిశీలించగా.. ప్రస్తుతం కనిపిస్తున్న వాతావరణ మార్పులు 2070 వరకు కొనసాగనున్నట్లు సూచిస్తున్నాయి. దమ్ముకు అవసరమైన 100 మిల్లీమీటర్ల వర్షం పడేందుకు 1960, 1970వ దశకాల్లో ఎంత సమయం పట్టిందో.. 2071-2098 సంవత్సరం కాలంలో అంతే 
అంటే అర్ధ శతాబ్దానికి పైగా ప్రస్తుత వాతావరణ పరిస్థితే కొనసాగుతుందన్నమాట. ఈ నేపథ్యంలో వరి దిగుబడులు తగ్గకుండా, ఖర్చులు పెరగకుండా ప్రణాళికలు రూపొందించుకోవాలని క్రీడా శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. 125 నుంచి 130 రోజుల్లో అధిక దిగుబడినిచ్చే రకాలు సాగు చేసుకోవాలని సూచిస్తున్నారు. తగినంత వర్షాలు పడని సంవత్సరాల్లో వెదజల్లి విత్తే పద్ధతిని ఆచరించాలని, గ్రామీణ విత్తన పథకం తరహాలో గ్రామీణ నారుమడి పథకాన్ని రూపొందించుకోవాలని సూచించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తికాకుంటే గోదావరి జిల్లాల్లో నీటి లభ్యత తగ్గే అవకాశం ఉందని, కాబట్టి దాళ్వాలో సాగు చేస్తున్న 7.5 లక్షల ఎకరాల ఆయకట్టును మూడు భాగాలు చేసి.. ఒకదాంట్లో వరికి బదులు అపరాల పంటలను పండించుకోవాలని, తద్వారా నీటి ఎద్దడిని నియంత్రించుకోవచ్చని సూచిం చారు. దీనిని ఏడాదికో ప్రాంతంలో అమలు చేయాలన్నారు.
Courtesy http://www.andhrajyothy.com/node/36622#sthash.Coz4xT8o.dpuf
Copy rights | Disclaimer | RKMP Policies